Navodayam, 25 నవంబర్ 2026: జార్ఖండ్: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ జార్ఖండ్ అసెంబ్లీ బుధవారం కీలక తీర్మానం ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికార సంస్థలకు పంపించి, అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం పారదర్శకమైన కొత్త ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) రూపొందించాలని కోరనుంది.
అసెంబ్లీ రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిశోర్ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఓటర్ల జాబితా సవరణలో విధానపరమైన సంక్లిష్టతలు, సాంకేతిక లోపాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని 2.21 కోట్ల మంది ఓటర్లలో 27 శాతం మందిని అనుమానితులుగా గుర్తించి నోటీసులు జారీ చేశారని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ను వెంటనే నిలిపివేసి, పారదర్శకతకు భరోసా ఇచ్చే కొత్త ఎస్ఓపీని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
బీజేపీ అభ్యంతరం
ఈ తీర్మానంపై చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు ఉద్దేశించిన ఎస్ఐఆర్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందన్నారు. తొలగించిన 43 లక్షల ఓటర్ల పేర్లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం పూర్తిగా వెల్లడించలేదన్నారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన వ్యక్తులను తిరిగి చేర్చడంపై దృష్టి సారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించాలని కోరారు.