Singareni Free Education: సింగరేణి కాలరీస్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, కార్మికుల పిల్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో పదో తరగతి వరకు పూర్తిగా ఉచిత విద్యను అందించనున్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన కోల్బెల్ట్ ప్రజాప్రతినిధుల భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల సంస్థలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది కార్మికుల కుటుంబాలకు మేలు జరగనుంది. సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న 9 పాఠశాలల్లో ప్రస్తుతం చదువుతున్న 400 మందికి పైగా విద్యార్థులకు ఈ సదుపాయం తక్షణమే వర్తిస్తుంది.
ఈ ఉచిత విద్యా పథకాన్ని అమలు చేయాలని కోరుతూ సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ అన్ని ఏరియాలకు అధికారిక ఆదేశాలు పంపారు. సింగరేణి పరిధిలోని పాఠశాలల్లో కార్మికుల పిల్లలకు ఉచిత ప్రవేశాలతో పాటు పదో తరగతి వరకు రూపాయి ఖర్చు లేకుండా చదువుకునే అవకాశం కల్పించారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుండటంతో, సింగరేణి స్కూళ్లలో చేరే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఉచిత విద్యా సదుపాయాన్ని పొందాలనుకునే కార్మికులు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు సర్క్యులర్లో స్పష్టం చేశారు.
బయట ప్రైవేటు స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న కార్మిక కుటుంబాలకు యాజమాన్య నిర్ణయం పెద్ద ఆర్థిక ఊరటనిస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులకు రూ. 5,500 చొప్పున లాభాల వాటా బోనస్ అందించి అండగా నిలిచిన సంస్థ, ఇప్పుడు వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తమ పిల్లల చదువు భారాన్ని తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.