షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 9:59 సా.
ఆంధ్రప్రదేశ్

సాగర్‌ నీళ్లకే కాదు.. శ్రీశైలానికీ ఎసరు

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 9:59 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
సాగర్‌ నీళ్లకే కాదు.. శ్రీశైలానికీ ఎసరు
  • అనుమతుల్లేకుండా కృష్ణా జలాల కేటాయింపులు.. ఆగని కుట్రలు
  • జల్‌ జీవన్‌ మిషన్‌ను ముందుపెట్టి జల దోపిడీ దిశగా బాటలు
  • నల్లమలసాగర్‌ నుంచి 1.73, గండికోట నుంచి 3.37 టీఎంసీలు
  • మొత్తంగా శ్రీశైలం, సాగర్‌ నుంచి 9.34 టీఎంసీల కేటాయింపులు
  • నిరుటి నుంచే ఏపీ జీవోలు.. ఎక్కడికక్కడ పనులకు ఆదేశాలు
  • తెలిసినా పట్టించుకోని రేవంత్‌ సరార్‌.. తెలంగాణకు తీరని నష్టం

హైదరాబాద్‌, నవంబర్‌ 25 (నమస్తే తెలంగాణ) : తాగునీరు పేరుతో ఏపీ సర్కార్‌ పెద్దకుట్రలే పన్నుతున్నది. సాగర్‌కు గండికొట్టడమే గాక ఎగువన శ్రీశైలం నుంచి అదనంగా 15 టీఎంసీల మళ్లించే ఎత్తుగడకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. ఈ మేరకు జలాలను స్వతహాగా కేటాయింపులు చేసుకుంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. అందుకోసం 2025నుంచే ఉత్తర్వులు జారీ చేస్తున్నది. ఈ తతంగమంతా రేవంత్‌ సర్కార్‌కు తెలిసినా పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణకు తీరని నష్టం వాటిల్లనున్నది.

నల్లమలసాగర్‌ నుంచీ 1.73 టీఎంసీలు

జల్‌జీవన్‌ మిషన్‌లో భాగంగా ఏపీ ప్రభుత్వం పలు రిజర్వాయర్ల నుంచి తాగునీటి కోసం అదనంగా నీటి కేటాయింపులు చేసింది. 2025 మే, నెలల్లోనే జీవో 207ను జారీ చేసింది. మొత్తంగా ఎనిమిది రిజర్వాయర్ల నుంచి 13.58 టీఎంసీలను కేటాయిస్తూ పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ రిజర్వాయర్లలో నాలుగు మినహా మిగతా రిజర్వాయర్లు కూడా ప్రధానంగా కృష్ణా జలాల ఆధారంగా, అందులోనూ శ్రీశైలం కేంద్రంగా నిర్మించిన ప్రాజెక్టుల పరిధిలోనే కావడం గమనార్హం.

అవుక్‌, గండికోట, చిత్రావతి, వెలిగల్లు రిజర్వాయర్లు పెన్నా బేసిన్‌లోనే ఉన్నా కూడా జలాలను ఏటా శ్రీశైలం జలాశయం నుంచే తరలిస్తున్నారు. శ్రీశైలం కుడికాలువ, జీఎన్‌ఎస్‌ఎస్‌ (గాలేరు నగరి సుజల స్రవంతి), హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ (హంద్రీనీవా సుజల స్రవంతి) ప్రాజెక్టుల కాలువల ద్వారా ఆయా రిజర్వాయర్లన్నింటినీ అనుసంధానించారు. తద్వారా శ్రీశైలం నుంచే కృష్ణా జలాలను ఏటా మళ్లిస్తున్నారు.

ఇక వెలిగొండ ప్రాజెక్టు శ్రీశైలం ఆధారంగానే చేపట్టినది. కృష్ణాజలాలను ఈ ప్రాజెక్టు ద్వారా నల్లమలసాగర్‌కు తరలిస్తారు. ఈ నల్లమలసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి 1.737 టీఎంసీలు కేటాయిస్తూ జీవో 189ని 2026 ఏప్రిల్‌ 16న, గండికోట రిజర్వాయర్‌ నుంచి 3.37 టీఎంసీల జలాలను తీసుకొనేందుకు జీవో 625ను 2025 నవంబర్‌ 24న జారీ చేసింది. మొత్తంగా కృష్ణా జలాల ఆధారంగా నిర్మించిన రిజర్వాయర్ల నుంచి అదనంగా 7.48 టీఎంసీలను అదనంగా కేటాయించగా, సాగర్‌ కేటాయింపులను సైతం కలుపుకొంటే 9.34 టీఎంసీలను తాగునీటికి ఏపీ అదనంగా కేటాయించింది. ఇవికాకుండా దిగువన ప్రకాశం బరాజ్‌ నుంచి సైతం ఏపీ సర్కార్‌ జల్‌జీవన్‌ మిషన్‌ కోసం 4.48 టీఎంసీలను, తుంగభద్ర ఆధారంగా నిర్మించిన పులికనుమ రిజర్వాయర్‌ నుంచి అదనంగా 0.58 టీఎంసీలను సైతం కేటాయించింది.

ఏపీ జీవోలు.. ఉలుకూపలుకు లేని సర్కార్‌

ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి ఎలాంటి ప్రాజెక్టులను చేపట్టాలన్నా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తొలుత అనుమతులు తీసుకోవాలి. బోర్డు, కేంద్రం నుంచి అనుమతులు పొందాలి. కానీ ఏపీ ప్రభుత్వం తాగునీటి పేరిట ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. స్వతహాగా కేటాయింపులు చేసుకుంటూ పోతున్నది. అనుమతులు తీసుకోకుండానే పనులను చేపడుతున్నది. 2025 మే నెల నుంచే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నుంచి అదనపు జలాలను కేటాయించుకుంటూ జీవోలను జారీ చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో చివరగా గత ఆగస్టులో నాగార్జునసాగర్‌ నుంచి 1.86 టీఎంసీల జలాలను కేటాయిస్తూ జీవో 453ను సైతం జారీ చేసింది. ఏపీ వరుసగా నీటి కేటాయింపులు చేసుకుంటూ, పనులను చేపడుతున్నా ఇప్పటివరకు తెలంగాణ సర్కార్‌ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. ఏపీ చర్యలన్నీ ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసని, వారి హుకుంతోనే క్షేత్రస్థాయిలో అధికారులు మిన్నకుండి పోయారని ఇరిగేషన్‌వర్గాలు అంటున్నాయి.

ఇటీవల నాగార్జునసాగర్‌ నుంచి ఏపీ చేపట్టిన జల్‌జీవన్‌ మిషన్‌ పనులు వెలుగులోకి రాగానే ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టింది. ఆగమేఘాల మీద కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం స్వయంగా వెల్లడించారు. ఏపీ చేపడుతున్న పనుల సమాచారం తమకు ముందే ఉన్నదని ఆయనే స్వయంగా సెలవిచ్చారు. పత్రికల్లో వచ్చేవరకూ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదనేది ఇప్పుడు చర్చ. అదీగాక కేవలం సాగర్‌కు సంబంధించిన అంశాలనే ఇప్పటికీ రేవంత్‌ సర్కార్‌ ప్రస్తావిస్తున్నది. కానీ శ్రీశైలం ప్రాజెక్టుకు ఎసరు పెట్టేలా, ఆ రిజర్వాయర్‌ జలాల ఆధారంగా చేపట్టిన ఇతర రిజర్వాయర్ల నుంచి చేసిన నీటి కేటాయింపులపై ఇప్పటికీ ప్రభుత్వ పెద్దలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు.

తెలంగాణకు తీరని నష్టం

ఏపీ సర్కార్‌ ఇష్టారీతిన తాగునీటి పేరిట స్వతహాగా చేసుకుంటున్న నీటి కేటాయింపులతో తెలంగాణకు తీరని నష్టమని ఇంజినీర్లు, నీటి రంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరజీవి జలధార (పల్నాడు వాటర్‌గ్రిడ్‌) ప్రాజెక్ట్‌ను ఏపీ జల్‌ జీవన్‌ మిషన్‌ కింద చేపట్టింది. ఈ పథకానికి సాగర్‌ నుంచి 1.86 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. వాస్తవంగా సాగర్‌ నుంచి ఏపీకి తాగునీటి కోసం 2.64 టీఎంసీల కేటాయింపులున్నాయి. కుడికాలువ ద్వారా సరఫరా చేస్తున్నారు.

అయితే తాగునీటి సరఫరాను ప్రత్యేకంగా చేపట్టేందుకు వాటర్‌గ్రిడ్‌ పేరిట ఏపీ ఇప్పుడు సిద్ధమైంది. తద్వారా పల్నాడు, దర్శి, పర్చూర్‌ పరిధిలోని 33 మండలాల్లోని 889 గ్రామాల్లో నీటిని సరఫరా చేయాలనే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. సాగర్‌ జలాశయం నుంచి ఇప్పటికే ఉన్న 2.64 టీఎంసీల కోటాలనే 1.865 టీఎంసీలను వినియోగించుకుంటామని నమ్మబలుకుతున్నది. కానీ గతనుభవాల దృష్ట్యా ఏపీ మున్ముందుకు విస్తరించే అవకాశమున్నదని నీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గతంలో ఇదే తీరుగా స్వల్ప సామర్థ్యాలతో నిర్మించిన హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌, జీఎన్‌ఎస్‌ఎస్‌, వెలిగొండ తదితర ప్రాజెక్టుల సామర్థ్యాలను ఇప్పుడు రెట్టింపు సామర్థ్యాలకు విస్తరించింది. ఆ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. అదీగాక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీకి ఉన్నదే 34టీఎంసీల కేటాయింపులని, అయినప్పటికీ ఏటా అంతకు రెట్టింపు జలాలను మళ్లిస్తున్నదని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుత తాగునీటి కేటాయింపులను సైతం హక్కుగా చూపే ప్రమాదమున్నదని, తెలంగాణ జలహక్కులకు తీరని నష్టమని నీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణం మేల్కోవాలని, ఏపీని అడ్డుకోవాలని, కేంద్రంపై, కేఆర్‌ఎంబీపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

#ఆంధ్రప్రదేశ్
అనుమతుల్లేకుండా కృష్ణా జలాల కేటాయింపులు.. ఆగని కుట్రలు జల్‌ జీవన్‌ మిషన్‌ను ముందుపెట్టి జల దోపిడీ దిశగా బాటలు నల్లమలసాగర్‌ నుంచి 1.73, గండికోట నుంచి 3.37 టీఎంసీలు మొత్తంగా…