షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 4:50 ఉద.
తెలంగాణ

నషాముక్త్ భారత్‌పై పాదయాత్ర

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 4:50 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
నషాముక్త్ భారత్‌పై పాదయాత్ర

నేడు అంబర్‌పేట నుంచి ప్రారంభం

27న ఫిలింనగర్‌లో ముగింపు

రాత్రిళ్లు దారిలోనే బస చేస్తా

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ముందుకెళ్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా అవగాహన కల్పించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి బుధవారం నుంచి 3 రోజుల పాటు నగరంలో పాదయాత్ర చేపట్టనున్నారు. అంబర్‌పేట నుంచి ప్రారంభమయ్యే యాత్ర 27న సాయంత్రం ఫిలింనగర్‌లో ముగుస్తుందని ఆయన తెలిపారు. రాత్రిళ్లు దారిలోనే బస చేస్తానని, యువత గంజాయికి దూరంగా ఉండాలని దారిపొడుగునా దండాలు పెడుతూ కోరుతానని చెప్పారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విదేశీ శక్తులు డ్రగ్స్ సరఫరాతో దేశాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చింతర రాంచంద్రా రెడ్డి, ప్రకాష్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడుకోకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తులో కాకుండా మేధస్సులో ముందుండాలని, కవులు, కళాకారులు, మేధావులు కూడా కార్యక్రమంలో కలిసి రావాలని కోరారు.

డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్తోందని తెలిపారు. ఇది పోలీసుల లేదా ప్రభుత్వాల కార్యక్రమం మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్లు భాగస్వాములయ్యే ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, యువతను కాపాడేందుకు కలిసి పనిచేయాలని ఆయన కోరారు.

ఒకప్పుడు వ్యవసాయం, ఇంజనీరింగ్, ఆటోమొబైల్ రంగాల్లో ఆదర్శంగా నిలిచిన పంజాబ్‌లో ఇంటింటికీ డ్రగ్స్ వ్యాపించాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు విస్తరిస్తోందని, కళ్లు తెరవకపోతే పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. పొరుగు దేశాల్లోని భారత వ్యతిరేక, ఉగ్రవాద శక్తులు డ్రగ్స్ సరఫరా చేసి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు ముప్పుగా మారుతోందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఉమ్మడి కుటుంబాలు తగ్గి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరగడం, తల్లిదండ్రులు ఉద్యోగాల్లో నిమగ్నం కావడం వల్ల పిల్లల్లో ఒంటరితనం పెరుగుతోందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 25 శాతం మంది యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు.

ఈ సమస్య పరిష్కారానికి 2029 నాటికి ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది యువతకు అవగాహన కల్పించడంతో పాటు, మొదటి దశలో లక్ష మంది ‘నషా ముక్త్ భారత్ మిత్ర’ వాలంటీర్లను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

#తెలంగాణ
నేడు అంబర్‌పేట నుంచి ప్రారంభం 27న ఫిలింనగర్‌లో ముగింపు రాత్రిళ్లు దారిలోనే బస చేస్తా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలిడ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ…