Navodayam, 25 నవంబర్ 2026: YS Jagan: కాకినాడ జిల్లా, ఉప్పాడ సుబ్బంపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నెల 4వ తేదీన చేపల వేట నిమిత్తం రెండు పడవల్లో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులలో, ఒక పడవ సురక్షితంగా తీరానికి చేరుకోగా, ఆరుగురు ప్రయాణిస్తున్న మరో బోటు ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన చెందారు.

ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాలి
సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణమే యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ కోరారు. భారత నౌకాదళం (ఇండియన్ నేవీ), కోస్ట్‌గార్డ్ బృందాల సహాయంతో సముద్రంలో గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
YS Jagan: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి
కన్నవారి ఆచూకీ తెలియక కన్నీరుమున్నీరవుతున్న మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు.