టెహ్రాన్ : అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. భూగర్భంలో నిర్మించిన రహస్య క్షిపణి కేంద్రానికి సంబంధించిన వీడియోను విడుదల చేస్తూ అమెరికాకు పరోక్ష హెచ్చరికలు పంపింది. తాజాగా విడుదలైన వీడియోలో ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించగల డబుల్ లాంచర్‌ను ప్రదర్శించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జిసి) కమాండర్లు భూగర్భ సొరంగాల్లో ప్రయాణిస్తూ క్షిపణి వ్యవస్థలను పరిశీలిస్తున్న దృశ్యాలు ఇందులో కనిపించాయి. యాంటీ షిప్ క్షిపణులు, సముద్ర లక్ష్యాలను ఛేదించే ఆయుధ వ్యవస్థలను కూడా చూపించింది.
ఇరాన్ క్షిపణి వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పలుమార్లు ప్రకటించారు. మరోసారి దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ విడుదల చేసిన తాజా వీడియోతో తమ ఆయుధ శక్తి ఇంకా చెక్కుచెదరలేదని స్పష్టం చేసింది. అమెరికా దళాలను, వారి మిత్రదేశాలను ఎదుర్కొనేందుకు తమ వద్ద ఇంకా ఆయుధ సంపత్తి ఉందని సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా భూగర్భంలో నిర్మించిన రహస్య క్షిపణి కేంద్రాల్లో ఆయుధాలను భద్రపరిచినట్లు చూపించడం ద్వారా, వాటిని గుర్తించి ధ్వంసం చేయడం అమెరికాకు అంత సులభం కాదనే సందేశాన్ని పంపినట్లు కనిపిస్తోంది.