కేసీఆర్, హయాంలోనే పనులు ప్రారంభం
మేం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ఒక్క అక్రమ ప్రాజెక్టు చేపట్టలేదు
విపక్షం బట్ట కాల్చి మా మొహం మీద వేస్తోంది
పోతిరెడ్డిపాడు విస్తరణ బీఆర్‌ఎస్ హయాంలోనే
ఎన్టీఆర్, వైఎస్సార్ చేపట్టిన పథకాలనూ కొనసాగిస్తున్నాం
కేంద్రం జనాభా లెక్కల సేకరణలో ఓబీసీ కాలామ్ చేర్చాలి
ఆహార ధాన్యాలకు కొరత లేదు
ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకే
సర్ పేరుతో 71లక్షల ఓట్లను పక్కనబెట్టారు
కాంగ్రెస్ పీఏసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి
కొత్త ఇన్‌చార్జిగా సందీప్ రాక సంతోషకరమని వ్యాఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రలో పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం గతంలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిందేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రలో ఒక్క అక్రమ నీటి ప్రాజెక్టు కూడా చేపట్టలేదని చెప్పారు.
ఆదివారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అక్రమ నీటి ప్రాజెక్టులన్నీ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేపట్టినవేనని ఆరోపించారు. పోతిరెడ్డి ప్రాజెక్టు, పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాలకు 2022లోనే కెసిఆర్ అనుమతించారని తెలిపారు. తమకు కేవలం 299 టీఎంసీల నీరు చాలని సంతకం చేసింది కెసిఆరే్‌నని విమర్శించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జల్ మిషన్‌కు రూ.1,580 కోట్లు విడుదల చేసేందుకు జీవో జారీ చేసిందని గుర్తు చేశారు.
పోతిరెడ్డిపాడు, పల్నాడు ప్రాజెక్టులు కెసిఆర్, జగన్ హయాంలో చేపట్టినవేనని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని అన్నారు. అయితే కొంతమంది విపక్ష నేతలు బట్టకాల్చి ముఖం మీద వేస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చేపట్టిన పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.
సందీప్ రాక సంతోషకరం
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా బిఎం సందీప్ నియమితులు కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు చిరు సత్కారంతో స్వాగతం పలికారు. మీనాక్షి నటరాజన్ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం, మునిసిపల్ ఎన్నికల్లో 85 శాతం విజయం సాధించామని వివరించారు.
100 ఏళ్ల తర్వాత తొలిసారిగా తెలంగాణలో ఒబిసి కులగణన నిర్వహించామని తెలిపారు. వచ్చే నెల జనవరిలో కేంద్రం చేపట్టే జనగణనలో ఒబిసి కాలమ్ చేర్చి కులగణన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం నుంచి తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. ఈ విషయంపై ప్రధానమంత్రికి లేఖ రాయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సూచించారు.
మొదటి ప్రధాని నెహ్రూ చొరవ వల్ల దేశంలో విద్య ప్రతి ఒక్కరికీ అందుతోందని చెప్పారు. నెహ్రూ ప్రణాళికలతో నీటిపారుదల రంగం బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆయన చొరవ వల్లే మిగులు ఆహార ధాన్యాలు ఉన్నాయని అన్నారు.
ఎల్‌నినోను ఎదుర్కొందాం
ఎల్‌నినో వల్ల వర్షాలు పడటం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. తక్కువ నీటితో పండే పంటలను రైతులు సాగు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు కొరత లేదని చెప్పారు. వర్షాకాలంలో 20 వేల మెగావాట్ల డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు విద్యుత్ అందించగలిగామని, పంటలు ఎండిపోకుండా కాపాడామని వివరించారు.
100 దేశాలు ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బంది పడుతున్నాయని, పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో కరవు పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రాబోయే 8 నెలలు తాగునీటిని అందించాల్సి ఉందని, ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగునీటి కోసం వినియోగించాల్సి ఉందని వివరించారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారి సంఖ్య బాగా పెరిగిందని చెప్పారు.
‘సర్’ పేరుతో కనీసం 20 కోట్ల ఓట్లు తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 13 కోట్లు తొలగించారని తెలిపారు. తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారని, కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పేరు సరిగా లేకపోయినా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. బ్రిటిష్ హయాంలోని సైమన్ కమిషన్‌లాగా, 100 ఏళ్ల తర్వాత మోడీ ‘సర్’ను తీసుకొచ్చారని విమర్శించారు. అప్పట్లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ‘గో బ్యాక్’ నినాదం ఇచ్చినట్లే, ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ ‘గో బ్యాక్’ నినాదంతో ముందుకు రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.