న్యూఢిల్లీ: మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభం (దీపత్తూన్) వద్ద సంప్రదాయ కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఈ మేరకు పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేశారు.
ఈనెల 24న దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు ఈ ఒక్క ఏడాదికి మాత్రమే అనుమతిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి ధర్మాసనం ఈ కార్యక్రమానికి దేవస్థానం (ఆలయ నిర్వహణ) నుంచి అధీకృత వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే వెళ్లాలని స్పష్టం చేసింది.
అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అదే సమయంలో సామాన్య ప్రజలు అక్కడికి వెళ్లకుండా నిషేధించింది. దీపం వెలిగించే కార్యక్రమంలో ఊరేగింపులు, ప్రజల గుమిగూడటం, నినాదాలు, నిరసన ప్రదర్శనలు అనుమతించరాదని స్పష్టం చేసింది. అయితే, దీపత్తూన్ వద్ద దీపం వెలిగించే సంప్రదాయాన్ని పునరుద్ధరించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను సమర్థించిన తీర్పులోని కొన్ని భాగాల అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది.