Social Media Troll : నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియా ట్రోలింగ్ మరియు నెగిటివిటీపై తొలిసారిగా అత్యంత ఘాటుగా స్పందించారు. తాజాగా తన కొత్త సినిమా ‘మైసా’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, నెట్టింట ఎదురయ్యే విమర్శలను తాను ఎలా హ్యాండిల్ చేస్తారో ఆసక్తికరంగా వివరించారు. ఒక నటిగా తనపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్ సర్వసాధారణమని, వృత్తిలో భాగంగా వాటిని తాను సులువుగానే తీసుకోగలనని రష్మిక తెలిపారు. అయితే, సినీ పరిశ్రమతో ఏమాత్రం సంబంధం లేని తన కుటుంబ సభ్యులను కానీ, స్నేహితులను కానీ అనవసరంగా ట్రోల్ చేస్తే మాత్రం తాను అస్సలు ఊరుకోనని గట్టిగా హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు ఎదురైతే తన స్పందన (రెస్పాన్స్) చాలా తీవ్రంగా, వేరేలా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
కెరీర్ ప్రారంభం నుంచి నిరంతరం ఏదో ఒక విషయంలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న రష్మిక, ఆ విమర్శలే తనను మానసికంగా మరింత దృఢంగా (స్ట్రాంగ్‌గా) మార్చాయని పేర్కొన్నారు. ఇతరులు చేసే నెగిటివ్ కామెంట్స్ తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని, వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. ఇక షూటింగ్ ఒత్తిడి, సోషల్ మీడియా స్ట్రెస్ నుంచి పూర్తిగా ఉపశమనం పొందేందుకు తాను క్రమం తప్పకుండా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంటానని రష్మిక తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ను పంచుకున్నారు. రష్మిక చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.