Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ అజ్ఞాత భక్తుడు కనీవినీ ఎరుగని రీతిలో భారీ బంగారు కానుకను సమర్పించనున్నారు. ఈ నెల 26న సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి విరాళంగా అందించేందుకు ఆ భక్తుడు సిద్ధమైనట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారికంగా వెల్లడించింది. మొత్తం 9 సెట్లుగా రూపొందించిన 45 అపురూప బంగారు ఆభరణాలను శ్రీవారి పాదాల చెంత సమర్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఆ దాత ఎవరనే వివరాలను టీటీడీ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది.
తిరుమల ఆలయ చరిత్రలో ఇప్పటివరకు ఒకే భక్తుడు ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని కానుకగా సమర్పించడం ఇదే తొలిసారని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తితో ఆ దాత అత్యంత నైపుణ్యంతో ఈ 45 రకాల ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది. స్వామివారి నిత్య కైంకర్యాలు మరియు ప్రత్యేక ఉత్సవాల సమయంలో అలంకరించేందుకు వీలుగా వీటిని రూపొందించారు. ఆలయ చరిత్రలోనే అతిపెద్ద విరాళంగా నిలవనున్న ఈ భారీ కానుక సమర్పణ కార్యక్రమాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.