శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టులోని నీటిని ఆరు జిల్లాల తాగునీటి అవసరాలకే రిజర్వ్ చేసినట్టు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లాల్ సింగ్ తన రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రాజెక్టులోకి సుమారు 30 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరిందని లాల్ సింగ్ తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 33.497 టీఎంసీల నీరు నిల్వ ఉందని, నీటిమట్టం 1,073 అడుగులుగా నమోదైందని వివరించారు. గత ఏడాది ఇదే రోజున నీటిమట్టం 1,091 అడుగులు ఉండగా, 80.501 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ వచ్చే ఏడాది జూన్ వరకు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు. దీంతో వచ్చే యాసంగిలో సాగునీరు అందించే పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తున్నది.
ప్రాజెక్టులో ప్రస్తుతం 33 టీఎంసీలే
ప్రాజెక్టులో ప్రస్తుతం 33 టీఎంసీల నీరు ఉందని, ఇందులో 6 టీఎంసీలను ఆరు జిల్లాల తాగునీటి అవసరాలకు కేటాయిస్తే 27 టీఎంసీలు మాత్రమే మిగులుతాయని రిపోర్టులో పేర్కొన్నారు. ఆయకట్టు రైతులకు యాసంగిలో సాగునీరు ఇవ్వాలంటే ప్రాజెక్టులో కనీసం 60 టీఎంసీల నిల్వ ఉండాలని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం 33 టీఎంసీలే నిల్వ ఉన్నాయని, అందులో 6 టీఎంసీలు తాగునీటి అవసరాలకు కేటాయిస్తే 27 టీఎంసీలు మాత్రమే మిగులుతాయని తెలిపారు. ప్రాజెక్టులో 14.77 టీఎంసీల నీటి నిల్వను డెడ్‌స్టోరేజీగా పరిగణించే నేపథ్యంలో ఈసారి యాసంగిలో సాగునీరు ఇవ్వడం ఆచరణలో సాధ్యం కాదని రిపోర్టులో వెల్లడించారు. 14.77 టీఎంసీల నీటి నిల్వను డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు.
కాకతీయ ప్రధాన కాలువ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 5.5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందిస్తున్నారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లోని రైతులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.
తాగునీటి అవసరాలకు ఏటా 6 టీఎంసీలు రిజర్వ్
ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని కేటాయిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాల కోసం నెలకు 0.5 టీఎంసీల చొప్పున, ఏడాదికి మొత్తం 6 టీఎంసీల నీటిని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాగునీటి కంటే తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రబీ పంటలకు సాగునీటిని విడుదల చేయడంపై ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ లేదని తెలుస్తున్నది.