షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 21 నవం 2026, 3:55 సా.
వినోదం

సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్టు

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 3:55 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్టు

కొత్త సినిమాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్

ఒక్కో సినిమాకు రూ.20 వేల చొప్పున క్రిప్టో కరెన్సీ చెల్లింపులు

ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్న టీజీసీఎస్బీ

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్త సినిమాలను థియేటర్లలో రికార్డు చేసి ఆన్‌లైన్‌లో లీక్ చేస్తున్న పైరసీ ముఠాను గుర్తించినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) తెలిపింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన విద్యార్థులు, సంతోష్ నగర్‌కు చెందిన షేక్ రిజ్వాన్ (19), భగత్ సింగ్ నగర్‌కు చెందిన రాంపోగు అజయ్ (19)లను టీజీసీఎస్బీ యాంటీ పైరసీ యూనిట్ శుక్రవారం అరెస్ట్ చేసింది. వారి నుంచి 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు సిటీ స్క్వేర్ మాల్‌లోని ఎస్వీసీ సినిమాస్‌లో కొత్త సినిమాలను చిత్రీకరించి గోఫైల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవారు. వీరి వెనుక ఉన్న ప్రధాన నిందితుడు టెలిగ్రామ్ ద్వారా సమన్వయం చేస్తూ, సినిమాలను పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానెళ్లలో అప్‌లోడ్ చేయించేవాడు. ఒక్కో సినిమాకు రూ.20 వేల చొప్పున క్రిప్టో కరెన్సీలో చెల్లించి, నిందితులు దానిని భారత కరెన్సీలోకి మార్చుకునేవారని తెలిపింది.

పైరసీ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలతో భారీ అక్రమ ఆదాయం సమకూర్చుకుంటున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. పైరసీ చేసిన చిత్రాల్లో ‘రామాయణ’, ‘సీన్’, ‘మహాశక్తి’, ‘ఈఎన్‌ఈ’, ‘ఆకాశంలో ఒక తార’, ‘ఓం’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం’ ఉన్నాయి.

42,151 పైరసీ లింక్‌లు బ్లాక్

టీఎఫ్‌సీసీ, టీజీసీఎస్బీ ఒప్పందంతో జనవరి 5న ఏర్పాటు చేసిన యాంటీ పైరసీ యూనిట్ ఇప్పటివరకు 42,151 లింక్‌లను బ్లాక్ చేసి, 87 హోస్టింగ్ సర్వర్లకు నోటీసులు ఇచ్చింది. 7 నెలల్లో 20కి పైగా సినిమాలకు సంబంధించి రూ.33.6 కోట్ల నష్టం నివారించిందని తెలిపింది. ఈ యూనిట్ దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు కాగా, పైరసీ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తోందని టీజీసీఎస్బీ అధికారులు తెలిపారు. సవరించిన సినిమాటోగ్రాఫ్ చట్టం-2023, ఐటీ చట్టాల కింద శిక్షలు తప్పవని టీజీసీఎస్బీ డైరెక్టర్ హెచ్చరించారు. ప్రధాన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

#వినోదం
కొత్త సినిమాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ ఒక్కో సినిమాకు రూ.20 వేల చొప్పున క్రిప్టో కరెన్సీ చెల్లింపులు ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్న టీజీసీఎస్బీ మన తెలంగాణ/హైదరాబాద్:…