షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 21 నవం 2026, 4:08 సా.
అంతర్జాతీయం

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సైనిక సాయం

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 4:08 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సైనిక సాయం

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సైనిక సాయం

భారత్ ఎదుగుదల చూడలేకే డ్రాగెన్ వ్యూహాత్మక నిర్ణయం

వార్షిక నివేదకలో అమెరికా కమిషన్ వెల్లడి

వాషింగ్టన్: ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్‌కు చైనా అందించిన సైనిక సహకారం.. ఆసియాలో భారత్ ఎదుగుదలను అడ్డుకోవాలన్న విసృ్తత వ్యూహంలో భాగమని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన యూఎస్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. సరిహద్దుల్లో సైనిక ఒత్తిడి, కీలక పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరాపై ఆంక్షలతో భారత్‌ను నియంత్రించేందుకు చైనా ప్రయత్నిస్తోందని తెలిపింది.

ఆపరేషన్ సిందూర్‌లో చైనా పాత్ర

2025 మేలో భారత్-పాక్ మధ్య మూడు రోజుల ఘర్షణల్లో చైనా ప్రత్యక్షంగా పాల్గొనకుండానే పాకిస్థాన్‌కు సైనికంగా అండగా నిలిచిందని నివేదిక పేర్కొంది. పాక్ వైమానిక దళానికి చెందిన జే-10సీఈ యుద్ధవిమానాల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు చైనా ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారం అందించారని, దీనిని చైనా ఈ ఏడాది తొలిసారిగా బహిరంగంగా అంగీకరించిందని తెలిపింది. భారత సైనిక మోహరింపులపై చైనా పాకిస్థాన్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందించిందని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ గతంలో వెల్లడించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. చైనా-పాక్ సైనిక భాగస్వామ్యం పెరగడంతో భారత్‌కు రెండు వైపుల యుద్ధ ముప్పు ఆందోళనకరంగా మారుతోందని విశ్లేషించింది.

సరిహద్దుల్లో ఒత్తిడి

హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ ఉనికి, నిఘా కార్యకలాపాలను విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. తూర్పు లద్దాఖ్‌లో 2024లో నాలుగేళ్ల ప్రతిష్టంభనకు తెరపడినప్పటికీ, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా బలగాలతో ఘర్షణలు కొనసాగుతున్నాయని తెలిపింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి బలగాలను వేగంగా తరలించేందుకు విమానాశ్రయాలు, రైల్వేలు, ఇతర రవాణా మౌలిక సదుపాయాలను చైనా అభివృద్ధి చేస్తోందని హెచ్చరించింది.

ఆర్థిక ఒత్తిడి

చైనా ప్రధాన అస్త్రం ఆర్థికమేనని కమిషన్ అభిప్రాయపడింది. ఎలక్ట్రానిక్స్‌కు అవసరమైన కీలక పరికరాలు, ముడిసరుకుల ఎగుమతులను నియంత్రించడం, చైనా సంస్థల్లోని ఇంజినీర్లను వెనక్కి పిలిపించడం ద్వారా భారత పరిశ్రమల పురోగతిని మందగింపజేస్తోందని పేర్కొంది. ఔషధ ముడిసరుకుల ధరలను తగ్గించడం వల్ల భారతీయ సంస్థలు పోటీపడటం కష్టమవుతోందని తెలిపింది. బ్యాటరీ సాంకేతికతపై ఎగుమతి నియంత్రణలు భారత్ స్వచ్ఛ ఇంధన పురోగతికి ఆటంకం కలిగించవచ్చని వివరించింది. కీలక పారిశ్రామిక ముడిపదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానంపై నియంత్రణతో చైనా తన తయారీ ఆధిపత్యాన్ని కాపాడుకుంటోందని కమిషన్ పేర్కొంది.

అమెరికా-భారత్ సహకారం

భారత్ సైనిక ఆధునికీకరణ, దేశీయ తయారీ, కీలక రంగాల్లో చైనా ప్రమేయ పరిమితిపై దృష్టిపెడుతోందని కమిషన్ పేర్కొంది. అయితే చైనా యంత్రాలు, విడిభాగాలపై ఆధారపడుతున్నందున ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలకు భారీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, సమయం అవసరమని తెలిపింది. చైనాతో దీర్ఘకాల పోటీలో ఆసియాలో శక్తి సమతూకాన్ని ప్రభావితం చేయగల కొద్ది దేశాల్లో భారత్ ఒకటని, చైనా తయారీ, సరఫరా వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా ఎదగగలదని నివేదిక పేర్కొంది. భారత్‌తో నిఘా, సముద్ర భద్రత, రక్షణ సాంకేతికత, పారిశ్రామిక తయారీ, సరఫరా వ్యవస్థలలో అమెరికా సహకారం పెంపొందించుకోవాలని సిఫారసు చేసింది.

#అంతర్జాతీయం
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సైనిక సాయం భారత్ ఎదుగుదల చూడలేకే డ్రాగెన్ వ్యూహాత్మక నిర్ణయం వార్షిక నివేదకలో అమెరికా కమిషన్ వెల్లడి వాషింగ్టన్: ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో…