Navodayam, 19 నవంబర్ 2026: రెండేళ్ల విరామం తరువాత ఈ వారం మొదటి రెండు రోజుల్లో మనీలాలో క్వాడ్ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) శిఖరాగ్ర సమావేశాలు వరుసగా జరగడంతో ఇండోపసిఫిక్ ప్రాంతం ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. ఈ సమావేశాలన్నిటిలోనూ చైనా ఒక ప్రధాన అంశం కావడం విశేషం. క్వాడ్ దేశాల నాయకులు తమ సంయుక్త ప్రకటనలో ఆర్థిక ఒత్తిళ్లు, ముఖ్యంగా ఏకపక్షంగా విధించే ఎగుమతి ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కీలకమైన ఖనిజాల సరఫరాపై తన ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని వాటిని ఆయుధంగా ఉపయోగించుకుంటుందని క్వాడ్ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. చైనా ఆర్థిక, వ్యూహాత్మక ఆధిపత్యం నేపథ్యంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ దేశాలతో కూడిన క్వాడ్ కూటమి ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతను కాపాడుకోవడానికి వాణిజ్య ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఐక్యతను మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర ప్రాంతాల పర్యవేక్షణ, కృత్రిమ మేధస్సు, ఇంధన రంగం, సైబర్ భద్రత రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని క్వాడ్ సదస్సు నిర్ణయించింది.
ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి దార్శనికతను రూపొందించి, దానిని పరస్పరం పంచుకోవాల్సిన అవసరాన్ని ఈ దేశాల నాయకులు గుర్తించారు. 2024 డిసెంబర్‌లో అమెరికా లోని డెలావేర్‌లో క్వాడ్ సదస్సు జరిగిన తరువాత మళ్లీ ఇప్పుడు క్వాడ్ సమావేశానికి పునరుజ్జీవం కల్పించారు. చైనా, రష్యాతో కలిసి ఎపెక్ (ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ) సదస్సులో పాల్గొనడానికి చైనా వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్వాడ్ సదస్సు విందుకు ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం. మధ్యంతర ఎన్నికల తరువాత దేశీయ రాజకీయాల్లో ట్రంప్ కొన్ని పరిమితులను ఎదుర్కొంటున్నప్పటికీ, విదేశాంగ వ్యవహారాలను మాత్రం ఆయన స్వేచ్ఛగా నిర్వహించగలుగుతున్నారు. భద్రతా రంగంలో క్వాడ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే విషయంపై ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ముఖ్యంగా ఇప్పుడు సూపర్ ఇంటెలిజెన్స్ క్వాడ్‌ను నడిపించబోతున్న నేపథ్యంలో అత్యాధునిక సూపర్ ఇంటెలిజెన్స్ పారిశ్రామిక విప్లవం కంటే గొప్ప మార్పును తీసుకు వస్తుందని, క్వాడ్ లోని సభ్యదేశాలన్నీ దీని ద్వారా ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో జలాంతర్గాములను గుర్తించడం, వాటి కార్యకలాపాలను ఎదుర్కోవడం వంటి జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాలపై క్వాడ్ మరింత దృష్టి పెట్టాలని సూచించారు.
ఇటీవలనే ఈ కూటమి నిర్వహించిన సంయుక్త సైనిక విన్యాసంలో ఇటువంటి కార్యకలాపాలను అనుకరించి సాధన చేసినట్టు ప్రస్తావించారు. అంతే కాకుండా వ్యర్థ పదార్ధాలనుంచి కీలకమైన ఖనిజాలను తిరిగి వెలికి తీసేందుకు భారతదేశం, ఆసియాన్ దేశాల్లో అవసరమైన సదుపాయాలను నిర్మించడానికి అమెరికా 10 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించింది. వచ్చే సంవత్సరం క్వాడ్ దేశాల వ్యాపార వేత్తలు, పారిశ్రామిక ప్రముఖులతో సమావేశం నిర్వహించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మార్గాలద్వారా సరకుల రవాణా సురక్షితంగా కొనసాగించాల్సిన అవసరాన్ని సదస్సు ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రస్తుతం ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్మూజ్ జలసంధి, ఎర్రసముద్రం, బాబ్ అల్ మందబ్ జలసంధి వంటి సముద్ర మార్గాల మీదుగా నౌకల రవాణా సురక్షితంగా జరగడం చాలా ముఖ్యమని పేర్కొంది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించగలిగితే ఈ సమస్యను పరిష్కరించడంలో అమెరికా ఎంతో చేయగలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ట్రంప్ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. క్వాడ్ కూటమిని అమెరికా ప్రధానంగా చైనాతో ఉన్న వ్యూహాత్మక పోటీ కోణం లోనే చూస్తోంది.
అయితే ఇండోనేసియా లోని జకార్తా కేంద్రంగా పనిచేసే ఆసియాన్ కూటమి మాత్రం అమెరికా, చైనా దేశాల్లో ఏదో ఒక దేశం వైపు వ్యూహాత్మకంగా మొగ్గు చూపాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుంటోంది. భారత్‌తో కలిసి విపత్తుల విషయంలో సహాయం అందించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ఈ సదస్సులో ఒక ఒప్పందం కుదిరినప్పటికీ, చర్చల్లో ప్రస్తావనకు రాని మరో ముఖ్యమైన అంశం ఉంది. అది ఆసియాన్ లోని 11 ఆగ్నేయాసియా దేశాల కూటమికి, భారత్‌కు మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నప్పటికీ వాణిజ్యం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందడం లేదు. ఇక్కడ చైనా ప్రభావమే అడ్డంకిగా మారుతోంది.
చైనాలో తయారైన వస్తువులను మరో మూడో దేశానికి తీసుకెళ్లి అక్కడ స్వల్పంగా మాత్రమే ప్రాసెస్ చేసి ఆ దేశంలో తయారైన వస్తువులుగా చూపించి భారత్ వంటి దేశాలద్వారా రాయితీలతో మార్కెట్ లోకి ప్రవేశించి అత్యధిక లాభాలు పొందుతాయన్న అనుమానాలు ఆసియాన్ దేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి చైనా లోని షెన్‌జెన్‌లో జరగనున్న ఎపిఇసి సమావేశంలో చైనా, అమెరికా, రష్యా త్రైపాక్షిక చర్చలపైనే ఉంది. ఈ మూడు దేశాల మధ్య కొత్త జి3 కూటమి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఒకవైపు క్వాడ్ దేశాలతో తన సంబంధాలను బలోపేతం చేసుకుంటూనే, మరోవైపు ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లోని ప్రతిష్టంభనను తొలగించి ఒప్పందాలను కుదుర్చుకోవాలి. అలాగే క్వాడ్ వాణిజ్య, పెట్టుబడి, సాంకేతికత, సముద్ర భద్రత సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది.