Vishwak Sen : సినీ పరిశ్రమలో సినిమా ఫ్లాప్ అయినా రిలీజ్ రోజు లేదా నెక్స్ట్ డే సక్సెస్ మీట్ పెడతారు. ఈ మాట పలువురు హీరోలు, దర్శక నిర్మాతలే మీడియాకు అనేక సందర్భాలలో చెప్పారు. హీరో విశ్వక్ సేన్ కూడా గతంలో ఓ ప్రెస్ మీట్ లో సినిమా హిట్ అయినా అవ్వకపోయినా సక్సెస్ మీట్ ఉంటుంది కదా అన్నారు. తాజాగా విశ్వక్ తన కల్ట్ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఇటీవల విశ్వక్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా కల్ట్ సినిమాని తెరకెక్కించాడు. కొత్త పాయింట్ తో సర్వైవల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. పాయింట్ బాగున్నా మొదటి అరగంట చాలా ల్యాగ్ ఉండటం, వైలెన్స్ ఎక్కువ ఉండటంతో ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. 20 కోట్ల పైగా గ్రాస్ రావాల్సి ఉండగా కేవలం 6 కోట్లు మాత్రమే వచ్చాయి కల్ట్ సినిమాకు. రిలీజ్ తర్వాత ఆ సినిమాకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. రిలీజ్ నెక్స్ట్ డే ఒక ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసారు.
ఇప్పుడు విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కల్ట్ సక్సెస్ మీట్ ఎందుకు పెట్టలేదు అని అడగ్గా విశ్వక్ మాట్లాడుతూ.. టైం లేదు. కల్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ సినిమా బిజీలో ఉన్నాను. ఈ సినిమాకు, కల్ట్ కి కలిపి రెండిటికి ఒకేసారి సక్సెస్ మీట్ పెడతాను అని అన్నారు. మరి విశ్వక్ సరదాగా అన్నాడో, కౌంటర్ వేశాడో తెలీదు కానీ ఫ్లాప్ సినిమాకు సక్సెస్ మీట్ అనడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.