మన తెలంగాణ/హైదరాబాద్: హైటెక్స్ వేదికగా ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైటెక్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సదస్సును ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.ఈ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఇతర రా ష్ట్రాల మంత్రులు, ఎంపిలు, ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెం దిన రోడ్లు, హైవేల రంగ నిపుణులు, ఇంజనీర్లు, అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు కలిపి సుమా రు 3,500 మంది పాల్గొంటారని వివరించారు.
‘రైట్ టు వాక్’ అంశంపై ప్యానల్ చర్చ
హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఆరుసార్లు సమావేశాలు జరగ్గా ప్రస్తుతం ఏడోసారి నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈసారి సదస్సులో పర్యావరణహిత రహదారుల నిర్మాణం, వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక రవాణా వ్యవస్థలపై చర్చలు జరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరికీ సురక్షితంగా నడిచే హక్కు కల్పించే ‘రైట్ టు వాక్’ అంశంపై ప్రత్యేక ప్యానల్ చర్చ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.