Cyclone Aqwan : ఆంధ్రప్రదేశ్‌కు అతి తీవ్ర తుఫాన్ ముప్పు తప్పినట్టే కనిపిస్తోంది.. మొదట్లో తీవ్ర ఆందోళన కలిగించిన అక్వాన్ తుఫాన్ ఇప్పుడు తన దిశను మార్చుకోవడంతో పాటు క్రమంగా బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తుఫాన్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీ తీర ప్రాంత ప్రజలకు కొంత ఊరట లభించినట్టయింది.
తుఫాన్ తీరం దాటే ఛాన్స్ :
తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. అక్వాన్ తుఫాన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలో తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉంది. అయితే, సముద్రం నుంచి తీరానికి దగ్గరవుతున్న కొద్దీ దీని తీవ్రత మరింత తగ్గే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
గాలుల వేగం కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉండటంతో భారీ తుఫాన్ ప్రభావం నుంచి రాష్ట్రానికి ఉపశమనం లభించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ముప్పు పూర్తిగా తొలగిపోయిందని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని అంటున్నారు.
పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు :
ఉత్తర కోస్తాంధ్రలోని పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టం చేస్తున్నారు.
వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా తుఫాన్ దిశ, తీవ్రతలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి వెల్లడించారు. అక్వాన్ తుఫాన్ తీవ్రత తగ్గే సూచనలతో ఏపీకి కొంత ఊరటనిచ్చే విషయమే అయినా తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరమని అధికారులు చెబుతున్నారు.